రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వేసవిలో లోతు దుక్కుల ప్రాముఖ్యత: వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమి లోపల కోశస్త దశలో ఉన్న హానికర పురుగులు, శిలీంధ్రాలు నశిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుంది. భూమి పొరల్లో తేమ మరియు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది వానాకాలం సాగు చేసే పంట వేరు వ్యవస్థ నేల లోపలి పొరల్లోకి చొచ్చుకెళ్తుంది. తద్వారా పైరుకు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. భూమి కోతను నివారిస్తుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా తయారవుతుంది. భూమిలో తేమశాతం పెరిగి భూసారం అభివృద్ధి చెందుతుంది. వేసవి లోతు దుక్కుల వలన పాతుకుపోయిన కలుపు మొక్కలు, వాటి విత్తనాలను సమూలంగా నిర్మూలించవచ్చు. వేసవి దుక్కులకు ముందు పొలంలో పశువుల పెంట, కంపోస్టు ఎరువులు, చెరువులు, కుంటల్లోని మట్టిని వెదజల్లడం ద్వారా భూసారం మరింత పెరుగుతుంది. ఈ ప్రక్రియ వానాకాలం సాగు చేసిన పంటలకు అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఇస్తుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.